ఈ మధ్య కాలంలో యువత టిక్ టాక్ యాప్ ని విపరీతంగా వినియోగిస్తున్నారు. ఈ యాప్ కోసం విన్యాసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. కాగా... తాజాగా ఓ యువతి టిక్ టాక్ కారణంగా ఓ యువకుడి చేతిలో మోసపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... శేరిలింగంపల్లికి చెందిన మిశాల్ జైన్(23)కు ఖానామెట్ కు చెందిన ఓ మహిళ(30)తో టిక్ టాక్ యాప్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి సహజీవనం చేయడం కూడా ప్రారంభించారు. శ్రీలంక, మాల్దీవులు, గోవా తదితర ప్రాంతాల్లో విహారయాత్రలు కూడా చేశారు.

దాదాపు ఆరునెలలపాటు సహజీవనం చేశారు. ఇటీవల యువతి పెళ్లి చేసుకుందామని యువకుడిని కోరింది. అప్పటి నుంచి యువతిని మిశాల్ జైన్ దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అయినా.. ఆమె వదిలిపెట్టకపోవడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు.  దీంతో బాధితురాలు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 417, 420, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.