హైదరాబాద్: జీహెచ్ఎంసీకి షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. తన కాలువిరిగిపోయినందుకు కారణం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

వివరాల్లోకి వెళ్తే పాతబస్తీలోని డబీర్ పురాకు చెందిన సయ్యద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రీ అనే యువకుడు అక్టోబర్ 6ఆదివారం రాత్రి 7.30 గంటలకు బైక్ మీద నూర్ ఖాన్ బజార్ నుంచి బాల్ షెట్టిఖేట్ కు బయల్దేరాడు. 

రోడ్డుమీద వెళ్తూ ఒక గుంతలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో యువకుడు కాలు విరిగిపోయింది. దాంతో ఆగ్రహం చెందిన జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తనకు ప్రమాదం జరిగిందని సయ్యద్ అజ్మత్ హుస్సేన్ జాఫ్రీ ఆరోపించారు. 

నగరపాలక సంస్థపై డబీర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కాలు విరగడానికి జోనల్ కమిషనర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇకపోతే హుస్సేన్ జాఫ్రీ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
 
ఇకపోతే గత కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల వల్ల హైదరాబాద్ లోని రోడ్లు చాలా దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. 

దాంతో రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో నరకం చూస్తున్నారు. వర్షం కురుస్తున్నప్పుడైతే వాహనదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 

రోడ్డ మీద నీరు నిలిచిపోవడంతో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ మ్యాన్‌హోల్ ఉందో కూడా తెలియని దుస్థితి. ఇలా రోడ్డు మీద ప్రయాణం చేస్తూ గుంతల కారణంగా బైక్ మీద వెళ్లే చాలా మంది ప్రమాదాల బారినపడుతున్న సంగతి తెలిసిందే.