హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. దుబాయ్ లో పని ఆశ చూపి అమ్మాయిల్ని అరబ్ షేక్ లకు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించిన వివరాలు..

పాతబస్తీలోని పేద ముస్లిం మహిళలకు దుబాయ్ లో ఉద్యోగం పేరుతో ఆశ కల్పిస్తున్నారు కొంతమంది బ్రోకర్లు. అక్కడికి వెళ్లాలంటే దుబాయ్ షేక్ లను పెళ్లి చేసుకోవాలని నమ్మిస్తున్నారు. అలా షేక్ ల దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకుని అమ్మాయిల్ని అప్పజెపుతున్నారు. 

ఆ తరువాత మహిళల్ని విజిటింగ్ వీసీ పేరుతో దుబాయ్ పంపిస్తున్నారు. ఇలా ఇప్పటికి ఐదుగురు మహిళల్ని బస్తీ బ్రోకర్లు అమ్మినట్టు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధిత మహిళల కుటుంబ సభ్యులు తమవారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

ఇదిల ఉంటే పాతబస్తీలో తాజాగా ట్రిపుల్‌ తలాక్‌ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి ఫోన్‌లో తన భార్యకు అదివలి అనే వ్యక్తి తలాక్‌ చెప్పాడని బాధితురాలు సభా ఫాతిమా తెలిపారు. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను వలి వివాహం చేసుకున్నాడు. 

ప్రస్తుతం ఫాతిమా భర్త అమెరికాలో ఉంటున్నాడు. తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్‌లో మూడుసార్లు తలాక్ అని చెప్పాడని ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆమె  గురువారం ఆశ్రయించారు.