హైదరాబాద్: మగ బిడ్డకు జన్మనివ్వలేదని ఆరోపిస్తూ తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడో ప్రబుద్ధుడు. మగబిడ్డను కనలేదని అందువల్లే ట్రిపుల్ తలాక్ చెప్తున్నట్లు తెలిపాడు. 
 
ట్రిపుల్ తలాక్ చెప్పడమే కాదని మరో యువతిని సైతం పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. మగబిడ్డను కనకపోతే విడాకులు ఇచ్చేస్తారా అంటూ ఆమె బోరున విలపిస్తుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.  

మెహ్రన్ బేగం అనే మహిళ తన భర్త దస్తగిరితో కలిసి హైదరాబాద్ లో ఉంటుంది. ఇటీవలే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టడంతో భార్యకు తలాక్ చెప్పాడు దస్తగిరి. తనకు మగపిల్లలు పుట్టకపోవడంతో వేరే యువతితో సంబంధం సైతం పెట్టుకున్నాడని ఆరోపించింది. 

తనకు వారసుడు కావాలని ఆ పని చేయలేదు కాబట్టి నువ్వవు నాకు అక్కర్లేదు అంటూ ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటూ మెహ్రన్ బేగం చార్మినార్ లోని మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. 

వారసుడిని కనలేదన్న వంకతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్న తన భర్త దస్తగిరిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇకపోతే 2011లో దస్తగిరికి, మెహ్రాన్ బేగంకు వివాహమైంది. పెళ్లైన ఏడాదికే మెహ్రాన్ బేగం గర్భం దాల్చింది. అయితే మెహ్రాన్ బేగం పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ అని తెలియడంతో పసరు మందులు వేసి అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించింది. 

పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చామని అయితే పెళ్లైనా ఏడాది నుంచే తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు ఆడపిల్ల పుట్టడంతో తనను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించింది.

ఇటీవలే తనను తన పుట్టింటికి తీసుకువచ్చి తన తల్లిదండ్రులకు అప్పగించి వారి ఎదురుగా ట్రిపుల్ తలాక్ చెప్పేశాడని ఆరోపించింది. తనకు వారసుడు కావాలని మీ అమ్మాయి ఇవ్వడం లేదని అందుకు ట్రిపుల్ తలాక్ చెప్తున్నట్లు దస్తగిరి చెప్పినట్లు పోలీసుల ఎదుట వాపోయింది మెహ్రాన్ బేగం. 

ఇకపోతే ట్రిపుల్ తలాక్ పేరుతో అర్థం పర్థం లేని చిన్న చిన్న కారణాలతో భార్యల్ని వదిలించుకుని మరో పెళ్లికి సిద్దపడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇటీవలే తన భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయనే సాకుతో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. 

అంతేకాదు బిర్యానీ చేయలేదనీ ఓ భర్త, కూర బాగా ఉండలేదనీ మరొకరు ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఎందరో ట్రిపుల్ తలాక్ చెప్పి భార్యలను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు తమ జీవితాన్ని కోల్పోతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

triple talaq: పెళ్లైన ఐదు నెలలకే విడాకులు.. కారణం తెలిస్తే షాక్..

ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంలో పిటిషన్లు: కేంద్రానికి నోటీసులు