అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్రమాదం అమెరికాలోని  టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ లో ఈ నెల 7న జరగగా.. హైదరాబాద్ నగరానికి చెందిన నేహా రెడ్డి మద్దిక ప్రాణాలు కోల్పోయారు.

నేహారెడ్డి స్నేహితురాలు ప్రియాంక రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో సౌత్ 1st స్ట్రీట్, వెస్ట్ మేరీ స్ట్రీట్ మధ్య రెండు వాహనాలు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నేహారెడ్డి తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 

ప్రమాదంలో నేహా తలకు బలమైన గాయాలు కావడంతో మెదడు దెబ్బతిని మరణించినట్లు సమాచారం. అందిరితో ఎంతో కలివిడిగా ఉండే నేహా ఇలా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఆమె స్నేహితులను తీవ్రంగా కలిచివేసింది. 

మృతురాలికి అమెరికాలో ఎవరూ లేకపోవడంతో మృతదేహాన్ని హైద్రాబాద్‌కు తరలించేందుకు గోఫండ్‌మీ ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు ప్రియాంక చెప్పారు. కాగా, ఆరు నెలల కింద నేహా తండ్రి విజయ్ భాస్కర్ రెడ్డి మరణించారని.. ఇంతలోనే తమ స్నేహితురాలు కూడా చనిపోవడం బాధాకరమని ప్రియాంక తెలిపారు. ఇక ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు క్షతగాత్రులను శనివారం ఉదయం చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు ఆస్టిన్-ట్రావిష్ కౌంటీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ట్వీట్ చేసింది.