Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, పార్ల‌మెంట్ స‌భ్యులు రేవంత్ రెడ్డిని పోలీసులు మ‌రోసారి హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టిన నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ఆయ‌న గృహ‌నిర్బంధంలోకి తీసుకున్నారు.  

Hyderabad: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ గురువారం నాడు విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా నిర‌శిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌కు దిగాయి. టీఆర్‌ఎస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తీరుకు నిరసనగా ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధ భవనాన్ని ఘెరావ్‌ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలను పోలీసులు గురువారం గృహనిర్బంధం చేశారు. వరి సేకరణ సమస్య మరియు ఇంధన ధరల పెరుగుదల, విద్యుత్ చార్జీల పెంపు, ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌పై కాంగ్రెస్ ఆందోళ‌న‌కు దిగింది. 

ప్ర‌స్తుతం అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఇప్ప‌టికే పలువురు పార్టీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకు ముందస్తు అనుమతి లేనందున నిర్బంధించామని పోలీసులు తెలిపారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు నిర్వహిస్తున్న నిరసనలపై పోలీసుల తీరుపై రేవంత్‌ ప్రశ్నించారు. మాకు వర్తించే నిబంధనలు టీఆర్‌ఎస్‌కు ఎందుకు వర్తించవు? అని ప్ర‌శ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావులను 'సయామీ ట్వీన్స్' (Siamese twins) అని విమ‌ర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నాయ‌ని ఆరోపించారు. మోడీ, కేసీఆర్ ఇద్ద‌రు ఇంధనం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి మధ్యతరగతి ప్రజలను అదే రీతిలో దోచుకుంటున్నారని మండిపడ్డారు.

తన ఇంటి బయట పోలీసుల మోహరింపున‌కు సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తనకు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…

అంతకు ముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ రహదారులపై టీఆర్‌ఎస్ నేతలు నిరసనలు తెలిపితే పోలీసులు అడ్డుచెప్పలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దఅన్నారు. రోడ్లపై, హైవేలు టెంట్‌లు వేసి నిరసన తెలిపిన పోలీసులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నిరసన తెలిపితే రూల్స్ అడ్డురావా అని పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిస్తే మాత్రం అడ్డుకుంటున్నారని చెప్పారు. అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరించారని తెలిపారు. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పౌరులం కాదు.. తాము ప్రజా సమస్యలపై నిరసన తెలపాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన ఒక భాగమని తెలిపారు. ధరలకు వ్యతిరేకంగా, పబ్‌లకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు తాము నిరసన చేస్తుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరు దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.