లక్షల్లో వేతనం, విలాసవంతమైన జీవితం, ఆస్తి, పాస్తులు వున్న వారు ఎవరైనా వాటితో జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు. అయితే ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు చెందిన సిరంశెట్టి సాత్విక్ ఉన్నత విద్యను పూర్తి చేసి హైదరాబాద్‌లో కొలువు సంపాదించాడు.

హైటెక్ సిటీ సమీపంలోని ఎస్ఈజెడ్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఏడాదికి 12 లక్షల వేతనం, కంపెనీకి దగ్గరలోని బాయ్స్ హాస్ట‌ల్‌లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లాపూర్‌లో సోమవారం విగతజీవిగా కనిపించాడు.

స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతుడు ఇంకా అవివాహితుడని పోలీసులు తెలిపారు.