హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరసగా మూడు రోజులపాటు కురిసిన వర్షాన్ని నగరం మొత్తం నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే.. ఈ వరదల కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఓ రిటైర్డ్ సైంటిస్ట్, ఆయన 81ఏళ్ల తల్లి.. ఈ వదరల కారణంగా చాలా అవస్థలు పడ్డారు. వరద ధాటికి వారి ఇళ్లు మొత్తం నీట మునిగిపోగా.. దాదాపు 15 గంటలపాటు ఇంటి టెర్రస్ పైనే ఉండిపోయారు. 15 గంటల తర్వాత సహాయ బృందం సహాయంతో వారు బయటపడగలిగారు. ఈ సంఘటన సరూర్ నగర్ లో చోటుచేసుకోగా.. ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రెండు రోజుల క్రితం నగరంలో ఏకధాటిగా వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షానికి పలు ఇళ్లు నీట మునిగాయి. ఈ క్రమంలో నగరానికి చెందిన సరూర్ నగర్ లోని  రిటైర్డ్ సైంటిస్ట్ తన్వీర్ ఇంట్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో.. ఆ వరద నీటి నుంచి బయటపడేందుకు తన్వీర్.. తన 81ఏళ్ల వయసు ఉన్న తల్లి, పని మనిషి కుటుంబంతో సహా ఇంటి టెర్రస్ పైకి ఎక్కారు.

తాము ప్రమాదంలో ఉన్నామని రక్షించాలంటూ ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు దాదాపు 50సార్లు ఫోన్ చేశారట. అయితే.. వాళ్లు స్పందించలేదని ఆయన వాపోయారు. దాదాపు 15గంటలపాటు తాము అక్కడే ఉండిపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

తన తల్లికి ఇటీవల భుజానికి సర్జరీ అయ్యిందని.. ఆమను వీల్ చైర్ లో కూర్చోపెట్టి.. టెర్రస్ పైకి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. మంగళవారం రాత్రి8గంటల సమయంలో.. తమ ఇంట్లోకి నీరు ప్రవేశించాయని ఆయన చెప్పారు. కేవలం గంటల్లో ఇళ్లంతా వరదమయం అయ్యిందని చెప్పారు.

తాను దాదాపు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ బృందాలకు 50సార్లు ఫోన్ చేశానని ఆయన చెప్పారు. కాగా.. వాళ్లు సహాయ బృందాలను పంపుతామని చెప్పారు కానీ.. పంపలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరుసటి రోజు ఉదయం 11గంటల వరకు తమ వద్దకు ఎవరూ రాలేదని ఆయన చెప్పారు. అప్పటి వరకు అంటే దాదాపు 15 గంటలు తాము అక్కడే ఇరుక్కుపోయామని చెప్పారు.

తన అమ్మ.. పనిమనిషి.. ఆమె ఇద్దరు చిన్నారులు చాలా భయపడిపోయారని ఆయన చెప్పారు. తన బంధువు ఒకరి సహాయంతో తమ ఇబ్బందిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని.. అప్పుడు కానీ.. తమకు సహాయం అందించడానికి వాళ్లు రాలేదని ఆయన చెప్పడం గమనార్హం.