హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా అన్ని ప్రాంతాల్లో ఎడ తెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మంగళవారం నాడు ఉదయం నుండి బుధవారం నాడు తెల్లవారుజాము వరకు హైద్రాబాద్‌ను వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు నీట మునిగాయి.

సోమవారం నాడు నుండి  రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు ఉదయం నుండి అక్కడకక్కడ భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం మధ్యాహ్నం నుండి హైద్రాబాద్ లో విరామం లేకుండా వర్షం కురిసింది. 

బుధ, గురు వారాల్లో కూడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడ్డాయి. ఈ రెండింటి కారణంగా  తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు.

రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని రంగంపల్లిలో అత్యధికంగా 146.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.హైద్రాబాద్ లో 121.8 మి.మీ వర్షపాతం నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

హైద్రాబాద్ నగరంలోని ఉప్పల్ చిలుకానగర్ లో 91.3 మి.మీ, హైద్రాబాద్ కవాడీగూడ డంపింగ్ యార్డు, హిమాయత్ నగర్ వద్ద 90.5 మి.మీ, రామ్ నగర్ లో 89.5 మి.మీ, ఉస్మానియా యూనివర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రాంతంలో 86.5 మి.మీ, ఎంసిహెచ్ఆర్‌డి కార్యాలయంలో 85.25 మి.మీ, నాంపల్లిలో 84.0 మి.మీ, ఖైరతాబాద్ లో 83.75 మి.మీ,తిరుమలగిరిలో 82.5 మి.మీ, సికింద్రాబాద్ పాటిగడ్డలో 81.75 మి.మీ., ఉప్పల్ లో81.3 మి.మీ, వర్షపాతం నమోదైంది.