Telangana rains: మూసీ నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పురానాపూల్, చాదర్‌ఘాట్ వంతెనలను అధికారులు మూసివేశారు.
Hyderabad rains: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రాష్ట్రంలోని వాగులు వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో చాలా ప్రాంతాల్లో వరదలు పొటెత్తాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇండ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరదనీరు చేరుతుండటంతో ఉస్మాన్ సాగర్‌లోని మరిన్ని గేట్లను తెరవాలని అధికారులు నిర్ణయించడంతో మంగళవారం మూసీ నదిలో నీటిమట్టం పెరిగింది. రిజర్వాయర్‌లోని అదనపు నీటిని 12 గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు.
మూసీ నదిలోకి భారీగా నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నది పక్కనే ఉన్న ఇళ్లలోకి నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్‌కు వారిని తరలించినప్పటికీ.. వారి సామాన్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ముసిని అనుకుని ఉన్న ప్రాంతాల ప్రజలు తమను ప్రభుత్వం అదుకోవాలని కోరుతున్నారు. ఇదివరకు తమకు ప్రభుత్వం 2BHK పథకం కింద గృహాలు నిర్మించి అందిస్తామని చెప్పినప్పటికీ.. ఇప్పటికీ ఆ వాగ్ధానాలు కార్యరూపం దాల్చలేదని వాపోయారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగరానికి సమీపంలోని నదులన్ని పొంగిపొర్లుతున్నాయి. మూసినదిలోకి నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. అప్రమత్తమైన అధికారులు మూసీ నదిలో నీటిమట్టం పెరగడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యగా పురానాపూల్, చాదర్‌ఘాట్ వంతెనలను మూసివేయాలని నిర్ణయించారు. అంతకుముందు మూసీ నదిలో వర్షపు నీరు ఎక్కువగా రావడంతో మూసారాంబాగ్ వంతెనను మూసివేశారు. వంతెనపైకి వాహనాలు రాకుండా ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
లోతట్టు ప్రాంతాల నివాసితులు నిరాశ్రయులయ్యారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీటి మట్టాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉస్మాన్ సాగర్‌లో ఫుల్ ట్యాంక్ మట్టం 1790 అడుగులకు గాను 1787.55 అడుగులకు చేరుకుంది. 15 గేట్లకు 12 ఎత్తివేయడంతో జలాశయం నుంచి ఔట్ ఫ్లో 7308 క్యూసెక్కులుగా నమోదవుతుండగా, ఇన్ ఫ్లో 6800 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, హిమాయత్ సాగర్ పూర్తి ట్యాంక్ లెవల్ 1763.50 అడుగులకు గాను 1761.25 అడుగుల నీటిమట్టం ఉంది. 17 గేట్లలో ఆరు ఎత్తివేత తరువాత, రిజర్వాయర్‌లోని నీటి అవుట్‌ఫ్లో 5780 క్యూసెక్కులుగా నమోదు కాగా, నీటి ఇన్ ఫ్లో 5500 క్యూసెక్కులు నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో వరదలో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే హిమాయత్ సాగర్ లేక్ సమీపంలో చిక్కుకున్న వారిని సైబరాబాద్ పోలీసులు రక్షించారు. వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు, నీట మునిగిన ఇండ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
