హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కనివిని ఎరుగని రీతిలో వర్షం కురిసింది. జోరువానలకు నగరం అంతా అతలాకుతలం అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. టోలిచౌకి ప్రాంతాల్లో విపత్తు సహాయక సిబ్బంది పడవల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని  తరలించారు. 

హైదరాబాద్ లో నిన్నొక్కరోజే 20 సెంటీమీటర్ల పైచిలుకు వర్షం కురిసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆ వర్ష బీభత్సం మరీ  ఎక్కువగా ఉంది. ఒక్క ఘట్ కేసర్ పరిధిలోనే 32 సెంటీమీటర్ల వాన కురిసింది. 

హైదరాబాద్ హిమాయత్ సాగర్ కి కురిసిన వర్షం వల్ల వరద పోటెత్తింది. గేట్లను ఎత్తి నటిని కిందకు వదిలారు. హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా మారింది. 

హైదరాబాద్ లో వర్షం ధాటికి గోడ కూలి 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వరద ఉధృతికి హైదరాబాద్ లోని రోడ్లే కాకుండా పలు జాతీయ రహదార్లు స్తంభించిపోయాయి. 

హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై పెద్ద ఎత్తున వరద పోటెత్తింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. పలు కార్లు నీట మునిగాయి. రోడ్డుకు ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 

భువనగిరి-చిట్యాల, నార్కట్‌పల్లి-అద్దంకి హైవేల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపైనా వరద పోటెత్తింది. ఈ రహదారిపై గూడూరు-పగిడిపల్లి గ్రామాల మధ్య మోకాలిలోతులో నీళ్లు నిలిచాయి. చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద, చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరి వద్ద జాతీయ రాహదారిపై మోకాలి లోతు నీళ్లు చేరాయి.

హైదరాబాద్ రోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. రోడ్లపైకి నీరు చేరడంతోపాటుగా, చేతిలో స్తంభాలు నేలకొరిగి మరికొన్ని చోట్ల అంతరాయం ఏర్పడింది. విద్యుత్ కూడా లేకపోవడం సహాయక చర్యలకు మరింత ఆటంకం కలిగించింది. 

 బుధవారం రోజంతా భారీగా, గురువారం తేలికపాటి వర్షాలుంటాయని పేర్కొంది. తీవ్ర వాయుగుండం మంగళవారం సాయంత్రం 5:30 గంటల తర్వాత తూర్పు ఈశాన్య దిశగా ప్రయాణించి ఖమ్మం జిల్లా కేంద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. 

అక్కడి నుంచి మధ్య మహారాష్ట్ర యరత్వాడ వైపు వెళ్లిపోతోంది. బుధవారం సాయంత్రానికి వాయుగుండం కాస్త బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఉదయం 5. ప్రాంతంలో ప్రారంభమైన వర్షం అర్థరాత్రి 1.00 గంట వరకు కొనసాగింది. కేవలం 6 నుంచి ఏడూ గంటల వ్యవధిలోనే దాదాపు 30 సెంటీమీటర్ల వర్షాన్ని హైదరాబాద్ నగరవాసులు చవిచూశారు.