హైదరాబాద్ లో నిన్న అర్థరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరమంతా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. 9 మంది మరణించారు కూడా. 

ఈ వరదల్లో అధికార యంత్రంగం అంతా రోడ్లపైన్నే ఉన్నారు. మునిసిపల్ సిబ్బంది నుండి మొదలుకొని పోలీసులు, విద్యుత్ సిబ్బంది, విపత్తు నిర్వహణ సిబ్బంది అంతా కూడా రాత్రంతా రోడ్లపైన్నే ఉన్నారు. కంట్రోల్ రూమ్ లో ఉన్న సిబ్బంది తమకందిన సమాచారాన్ని విపత్తు నిర్వహణ టీంలకు చేరవేయగా వారు రంగంలోకి దూకి పరిస్థితిని చక్కదిద్దారు. 

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు రోడ్లపైన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడం దగ్గరినుండి నీటిని తోడడం వరకు అన్ని పనులను తామై చేసారు. రాత్రంతా వాహనదారులను క్షేమంగా వెళ్లేందుకు వీలుగా తాత్కాలిక ఏర్పాట్లను సైతం చేసారు. 

ఫైర్ సిబ్బందితో కలిసి  వరద నీటిలో కొట్టుకుపోతున్నవారిని రక్షించారు కూడా పోలీసులు. ఇంకా కూడా రోడ్లపైన్నే, నీట మునిగిన కాలనీల్లో సహాయక చర్యల్లో జిహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి పాలుపంచుకుంటున్నారు. 

విద్యుత్ సిబ్బంది సాధ్యమైనంత మేర విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసారు. చెట్లు నేలకూలిన చోట అర్థరాత్రి సైతం విద్యుత్ ను పునరుద్ధరించారు. కొన్ని సుబ స్టేషన్లలోకి నీరు ప్రవేశించడంతో ఇంకా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేకపోయారు. మరికొంతసేపట్లో కూడా విద్యుత్ ని క్రమబద్దీకరిస్తామని వారు తెలిపారు. 

ఇంత భారీ వర్షాన్ని సైతం తట్టుకొని సైతం హైదరాబాద్ నగరం నిలవగలిగిందంటే అది పూర్తిగా అధికార యంత్రాంగం కృషి అనడంలో ఎటువంటి సంశయం లేదు. వరద ప్రమాదం పూర్తిగా తొలిగిపోయేంత వరకు అధికారులంతా విధుల్లోనే ఉండనున్నారు.