హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పంజగుట్ట వద్ద కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

వంద మీటర్ల స్టీల్ బ్రిడ్జి రూ.5.95 కోట్లతో మూడు మాసాల్లో నిర్మించారు. లాక్ డౌన్ సమయంలోనే ఈ బ్రిడ్జి పనుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీన బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇవాళ బ్రిడ్జిని ప్రారంభించారు.

నాగార్జున సర్కిల్ నుండి కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే రోడ్డు చాలా ఇరుకుగా ఉన్న కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఈ స్టీల్ వంతెనను ప్రభుత్వం నిర్మించింది.

ఈ ప్రాంతంలో సంప్రదాయంగా నిర్మించే కాంక్రీట్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యం కానందున ఈ350 గ్రేడ్ ప్లేట్ గిర్డర్ లను ఉపయోగించినట్టుగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో పంజాగుట్ట నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఈ బ్రిడ్జిని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి మహమూద్ అలీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడ పాల్గొన్నారు.