జగద్గిరిగుట్టలో ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. జగద్గిరిగుట్ట సీఐ సైదులు వివరాల ప్రకారం ఆస్ బెస్టాస్ కాలనీకి చెందిన ఎస్కె. నవాజ్(23)కు వివాహమై భార్య, కుమార్తె ఉన్నారు. ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 

కర్నూలుకు చెందిన ఇమ్రాన్ (22) జగద్గిరిగుట్ట రింగుబస్తీలో నివసిస్తున్నాడు. ఇతనూ ఆటోడ్రైవరే. వీరిద్దరికీ జనవరి 29న జరిగిన గొడవలో పలువులు పాల్గొన్నారు. తనను గిరినగర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారని ఇమ్రాన్ ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 

ఈ నెల 19న తన స్నేహితులతో మాట్లాడుకుందాం రమ్మని నవాజ్ కు ఫోన్ చేయించాడు ఇమ్రాన్. శ్రీనివాసనగర్ లోని అంబేద్కర్ కూడలిలో నవాజ్ ను ఇమ్రాన్, బెమ్మనపల్లి శ్రీకాంత్ (20), ముక్కెర మురళి (35) వెంబడించారు. హెచ్డీఎఫ్ సీ ఏటీఎం వద్ద కత్తితో పొడిచి పరారయ్యారు. 

స్థానికులు నవాజ్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. నవాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్, జగద్గిరిగుట్ట షిర్డీహిల్స్ కు చెందిన శ్రీకాంత్, ఫిరోజ్ గూడకు చెందిన మురళీలను రిమాండ్ కు పంపారు.