వాటాల వివాదంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుగా నోటీస్ ఇచ్చిన అనంతరం అరెస్ట్ చేయాలనే యోచనతో ఉన్నట్లు సమాచారం.

వాటాల విక్రయం, ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు పంపారు.

వీటికి స్పందించని రవిప్రకాశ్.. నెల రోజుల పాటు ఆజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే హఠాత్తుగా విచారణకు హాజరైన ఆయన పోలీసులకు దర్యాప్తులో ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం. దీంతో విచారణకు సహకరించడం లేదనే కారణాన్ని చూపి.. పోలీసులు రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మూడు రోజులుగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్ పొంతన లేని సమాధాలు ఇచ్చినట్లుగా తెలిసింది. టీవీ 9 సృష్టికర్తను తానేనని... తానెలాంటి తప్పూ చేయలేదని చెబుతూ అసలు విషయాలను మాత్రం బహిర్గతం చేయాలేదని పోలీసుల వాదన.

మరోవైపు టీవీ9 లోగో విక్రయానికి సంబంధించిన కేసులో రవిప్రకాశ్‌ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.