హైదరాబాద్: హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న ఐదు నెలల గర్బిణి కృష్ణప్రియ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆత్మహత్యకు ముందు మృతురాలు తన స్నేహితురాలితో చేసిన వాట్సాప్ చాటింగ్  బయటకు వచ్చింది.పోలీసులు ఈ చాటింగ్ ను పరిశీలిస్తున్నారు.

తన భర్త శ్రావణ్ తనను బంగారం కోసం కొడుతున్నాడని ఆమె తన స్నేహితురాలికి చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్నందుకు భరించాల్సి వచ్చిందని ఆమె ఈ చాటింగ్ లో ఆవేదన వ్యక్తం చేసింది.

గర్భిణి అని చూడకుండా తనను కొడుతున్నారని ఆమె తెలిపింది.తన జీవితం నాశనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకొన్నాక తల్లికి కూడ చెప్పుకున్నా ఫలితం లేదని ఆమె బాధపడింది.

బుధవారం నాడు రాత్రి  కృష్ణప్రియ ఆత్మహత్య చేసుకొంది. ఐడీపీఎల్ లో జిమ్ నిర్వహణకు కృష్ణప్రియ రూ. 5 లక్షలు ఇచ్చినట్టు కూడ పోలీసుల విచారణలో వెల్లడైంది.

అత్తింటి వేధింపులు భరించలేక గర్భిణి ఆత్మహత్య చేసుకొన్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్  పరిధిలో చోటు చేసుకొంది. దిల్‌సుఖ్ నగర్ కు చెందిన సంజీవరావు కూతురు కృష్ణప్రియ సందీప్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే అతని నుండి విడాకులు తీసుకొన్న ఆమె.. తాను ప్రేమించిన వరుసకు మేనబావ అయిన శ్రావణ్ కుమార్ ను రెండో పెళ్లి చేసుకొంది.

పెళ్లైన నాటి నుండి అత్త, భర్త తనను అదనపు కట్నం కోసం  వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించింది. కృష్ణప్రియకు సీమంతం కోసం తమ ఇంటికి పంపాలని తాము కోరినా కూడ పంపలేదని బాధిత కుటుంబం ఆరోపించింది. 

బంగారం, బైక్ ఇస్తేనే పంపుతామని చెప్పడంతో మనోవేదనకు గురైన కృష్ణప్రియ ఆత్మహత్యకు పాల్పడిందని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అత్తింటివారి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకొందని కృష్ణప్రియ తల్లి లీల ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.