ప్రవళిక సూసైడ్ కేసులో కీలక పరిణామం: పోలీసుల అదుపులో శివరామ్
ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరామ్ రాథోడ్ ను హైద్రాబాద్ పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ప్రవళిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్ రాథోడ్ ను బుధవారంనాడు హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పోటీ పరీక్షలు వాయిదా పడడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందనే ప్రచారంతో పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే ప్రవళిక ఆత్మహత్యకు శివరామ్ కారణమని పోలీసులు తేల్చారు. శివరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ప్రవళికను ప్రేమించిన శివరామ్ రాథోడ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు.గ్రూప్-2 తో పాటు ఎలాంటి పోటీ పరీక్షలు కూడ ప్రవళిక రాయలేదని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. హైద్రాబాద్ లోని హస్టల్ లో 15 రోజుల క్రితమే ఆమె చేరిందన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శివరామ్ తో ప్రవళిక చాటింగ్ చేసిందని కూడ డీసీపీ వివరించారు.ప్రవళిక రాసినట్టుగా ఉన్న సూసైడ్ నోట్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టుగా డీసీపీ వివరించారు.
also read:మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు.. శివరామ్ వల్లే ప్రవల్లిక ఆత్మహత్య : కుటుంబ సభ్యులు
ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత శివరామ్ కన్పించకుండా పోయారు. శివరామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ శివరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ప్రవళిక ఆత్మహత్య ఘటనపై శివరామ్ పై ఐపీసీ 420,417, 306 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.