జూబ్లీహిల్స్ అత్యాచార కేసులో నిందితులకు పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో పోటెన్షీ టెస్ట్ నిర్వహించారు. ఇదే సమయంలో విచారణ సందర్భంగా నిందితులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముందుగా సాదుద్దీనే తమను రెచ్చగొట్టాడని మైనర్లు ఆరోపిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో (amnesia pub case) పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గడచిన మూడు రోజులుగా నిందితులను విచారిస్తున్న పోలీసులు శనివారం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి (osmania medical college) తరలించారు. నిందితులకు లైంగిక సామర్ధ్య పరీక్షలు చేయించేందుకే వారిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.
సదరు పరీక్షల అనంతరం పోలీసులు తిరిగి నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైనర్ బాలురు అత్యాచారానికి ఎలా పాల్పడతారన్న వాదనలకు తెరదించేందుకే పోలీసులు నిందితులకు లైంగిక సామర్థ్య పరీక్షలు చేయించినట్టుగా సమాచారం. ఈ పరీక్షల నివేదికలను పోలీసులు ఛార్జీషీట్‌కు జత చేయనున్నారు. ఈ కేసులో పక్కా సాక్ష్యాధారాలు సేకరించాలన్న దిశగా సాగుతున్న క్రమంలోనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇకపోతే.. రేప్ కేసులో తమ తప్పు లేదని మైనర్లు అంటున్నారు. తమను సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టాడని చెబుతున్నారు. ముందుగా బాలికతో మైనర్లే అసభ్యంగా ప్రవర్తించారని సాదుద్దీన్ అంటున్నాడు. ఎమ్మెల్యే కొడుకు ముందుగా అసభ్యంగా ప్రవర్తించాడని.. తర్వాత తామూ అనుసరించామని సాదుద్దీన్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్ ఎన్టీవీ కథనాలను ప్రసారం చేసింది. కాన్సూ బేకరీ వద్ద ఎమ్మెల్యే కుమారుడు కారు దిగి వెళ్లిపోయాడని సాదుద్దీన్ చెబుతున్నాడు. బెంజ్ కారును కాన్సూ బేకరీ దగ్గర పార్క్ చేసి.. ఇన్నోవా కారులో ఐదుగురుం వెళ్లిపోయామని స్టేట్‌మెంట్‌లో చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎస్కేప్ అయ్యామని.. ఎక్కడికి వెళ్లాలో ముందుగా ప్లాన్ చేసుకోలేదని నిందితులు చెబుతున్నారు. అత్యాచారం కేసులో భాగంగా సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు మైనర్లను పోలీసులు ప్రశ్నించగా వారు పై విధంగా సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.
