సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతికి స్వగ్రామాలకు వెళుతున్న వారు పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని అంతరాష్ట్ర ముఠాలు చోరికి పాల్పడుతున్నాయని.. అందువల్ల దొంగలకు అవకాశం ఇవ్వకుండా ఉండేంకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.  

స్వగ్రామాలకు వెళ్లేవారు సంబంధిత సెక్టార్  ఎస్సైకి చెబితే.. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడంతో పాటు ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని సీపీ పేర్కొన్నారు. అలాగే ఇరుగు పొరుగు వారికి కూడా సమాచారం ఇవ్వాలని చెప్పారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రించేందుకు త్వరలో జోనల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

వీటి ద్వారా ఎప్పటికప్పుడు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడంతో పాటు... స్టేషన్ పరిధిలో విధుల నిర్వహణపై సమీక్ష చేసుకునే వీలుందన్నారు. మరోవైపు దొంగతనాలు, గొలుసు చోరీలను నివారించేందుకు కఠిన చర్యలు చేపట్టామని అందువల్ల గతేడాది 30 శాతం స్నాచింగ్ కేసులు తగ్గాయని అంజనీకుమార్ తెలిపారు.

నగర శివారు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు ఎక్కువవుతుండటంతో ప్రత్యేక డ్రైవ్ ప్రారంభిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. నేరం చేసిన వారు ఎవ్వరు తప్పించుకోలేరని సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఏర్పాటుతో నిందితులు, కరడుగట్టిన నేరస్థులను అరెస్ట్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.