రక్షణగా వుండాల్సిన పోలీసే ఓ యువతిపై వేధింపులకు దిగాడు. ఏడాదిన్నరగా ప్రేమ పేరుతో అతడు వేధిస్తున్నా భరిస్తూ వచ్చిన యువతి వేధింపులు మరీ ఎక్కువవడంతో తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు సదరు పోలీస్ పై నిర్భయ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని చిలకలగూడలో చోటుచేసుకుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ పోలిస్ స్టేషన్లో లాలాగూడ నివాసి మహ్మద్ ఇలియాజ్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు ముషిరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించేవాడు. కానీ ఆ యువతి ఇతడి ప్రేమన అంగీకరించలేదు. ఇలా యువతి ఇష్టంలేదంటున్నా వినకుండా తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకుందామని ఇలా రకరకాలుగా  వేధించేవాడు. ఇలా ఏడాదిన్నరగా యువతి వెంట ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 

ఈ మధ్యకాలంలో అతడి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి.  దీంతో భరించలేకపోయిన యువతి ముషీరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో హోంగార్డుపై  
పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలియాస్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.