సైనిక్ పరేడ్ లో ఓ చిన్నారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడేళ్ల చిన్నారికి ఆర్మీ ప్రత్యేక గౌరవం ఇచ్చి.. ఆ చిన్నారిని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా చేసింది. సికింద్రాబాద్‌ మిలటరీ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగిన ఆర్మీ డే వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించింది. చిన్నారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సమీర్‌ పాత్ర, వర్ష పాత్రల కుమార్తె న్యోరా పాత్ర గతేడాది రిపబ్లిక్‌ డే వేడుకలను టీవీల్లో చూసి ఆర్మీ పట్ల అభిమానాన్ని పెంచుకుంది. ఆర్మీ దుస్తులు ధరించి తనను తాను సైనికురాలిగా ఊహించుకునేది. ఆర్మీకి సంబంధించి వందలాది పెయింటింగ్‌లు వేస్తూ గడిపేది. అంతటితో ఆగకుండా తాను ఆర్మీని ప్రత్యక్షంగా కలుసుకోవాలని తల్లిదండ్రులను కోరుతూ వచ్చింది.

తల్లిదండ్రులు ఆమె కోరికను వ్యక్తపరుస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి ఈ మెయిల్స్, లేఖలు రాశారు. న్యోరాకు ఇండిపెండెంట్‌ డే లేదా రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు ప్రధాన మంత్రి కార్యాలయ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. పీఎంవో ఆదేశాల మేరకు శుక్రవారం జరిగిన ఆర్మీ డే, ఆర్మీ వెటరన్స్‌ డే వేడుకలకు  ఆర్మీ అధికారులు న్యోరాను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. కల్నల్‌ ర్యాంకు అధికారి, ఇద్దరు సోల్జర్స్‌ ఆధ్వర్యంలో న్యోరాకు భద్రత కల్పిస్తూ ఆమెను సికింద్రాబాద్‌లోని వీరుల సైనిక స్మారకం వార్‌ మెమోరియల్‌కు తీసుకొచ్చారు. ఓ యువరాణిలా న్యోరాను గౌరవిస్తూ ఆప్యాయ పలకరింపులు, ఆమెతో ఫొటోలు దిగుతూ మరింత ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా న్యోరాతో కలసి ఆర్మీ ఉన్నతాధికారులు అమరవీరులకు సైనిక వందనం సమర్పించారు.