ఓ వైపు  భారతదేశంలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. నిన్నటి వరకు వందల్లో నమోదైన కేసులు, ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

వైరస్ చైన్‌ను తెంపడానికి ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే లాక్‌డౌన్‌ను రెండుసార్లు పొడిగించారు. ఇంతటి విపత్కర పరిస్ధితుల్లోనూ ప్రజలు ప్రభుత్వాల మాటను లెక్కచేయడం లేదు.

Also Read:తెలంగాణలో మరో 15 కేసులు... 45 మంది డిశ్చార్జ్: 1,122కి చేరిన సంఖ్య

అవసరం ఉన్నా లేకున్నా రోడ్ల మీదకు వస్తూ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌వాసులు లాక్‌డౌన్ నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు.

నగరంలో ప్రధాన కూడలి అయిన కూకట్‌పల్లి జేఎన్‌టీయూ వద్ద శుక్రవారం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు నిబంధనలను పట్టించుకోకపోవడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:ఆయనో క్వారంటైన్ సీఎం.. ఆరేళ్లుగా అందులోనే: కేసీఆర్‌పై బండి సంజయ్ వ్యాఖ్యలు

ఒక్కొక్కరిని తనిఖీ చేస్తూ అవసరం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో 2 రోజుల వ్యవధిలోనే 20కి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.

అలాగే రోజుకి 2 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,122కి చేరగా... 693 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 400 మంది బాధితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.