హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగు చూసింది. ఒకరు చనిపోతే మరొకరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన  కుటుంబసభ్యులు ఆమె బతికి ఉండడం చూసి షాకయ్యారు.

ఉస్మానియా ఆసుపత్రిలో డబీర్‌పురాకు చెందిన మహిళ మరణించింది. ఇదే ఆసుపత్రిలో పాతబస్తీకి చెందిన మరో మహిళ కూడ చికిత్స పొందుతోంది. డబీర్ పురా మహిళ కుటుంబసభ్యులకు బదులుగా పాతబస్తీకి చెందిన మహిళా కుటుంబసభ్యులకు ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది సమాచారం ఇచ్చారు.

కుటుంబసభ్యులు ఆసుపత్రికి వచ్చేసరికి పాతబస్తీ మహిళ బతికే ఉంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ షాకయ్యారు. తమ పిల్లలతో ఆమె మాట్లాడింది. చనిపోయిందని చెప్పిన మహిళ బతికి ఉందని తెలుసుకొని బంధువులు, కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

చనిపోయిన మహిళ పేరు బతికున్న మహిళ పేరు ఒకటే. దీంతో ఈ పొరపాటు జరిగిందని పోలీసులు తెలిపారు.  ఉస్మానియా సిబ్బంది నిర్లక్ష్యంతో తాము తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.

ఒకే పేరుతో ఉన్న ఇద్దరు మహిళలు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఒకరు కరోనాతో చికిత్స కోసం చేరితే మరొకరు శ్వాసకోస సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

కరోనాతో ఆసుపత్రిలో చేరిన మహిళ సోమవారం నాడు మరణించింది. అయితే ఉస్మానియా సిబ్బంది శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన మహిళ చనిపోయినట్టుగా కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఆసుపత్రికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ తన తల్లిని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. బతికుండగానే ఎలా చనిపోయిందని చెబుతారని ఉస్మానియా సిబ్బందిపై ఫైరయ్యారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.