అయ్యప్ప మాల ధరించాలని అనుకునే పోలీసులకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హెచ్చరిక చేశారు. మాల ధరించి అయ్యప్ప దీక్ష చేపట్టే పోలీసులు సెలవు పై వెళ్లాలని ఆయన సూచించారు. విధుల్లో ఉన్నవారు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

అయ్యప్ప దీక్ష సమయంలో పోలీసులు సిబ్బంది ఆచరించే నియమాల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటారు. ఇందుకు సంబంధించి కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అయ్యప్ప దీక్ష చేపట్టి పోలీస్ సిబ్బంది అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటినీ పరిశీలించిన సీపీ మహేష్ భగవత్ ప్రధాన కార్యాలయం జారీ చేసిన మెమో నెం.987 ఈ32011 ప్రకారం యూనిఫాం , షూస్ లేకుండా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించడం కుదరదన్నారు.

అయ్యప్ప దీక్ష చేపట్టే సిబ్బంది సెలవు తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదన్నారు. పోలీస్‌ సిబ్బంది గడ్డాలు, మీసాలు పెంచి విధులు నిర్వహించడం కుదరదని చెప్పారు. అవసరమైన వారు రెండు నెలలపాటు సెలవుతీసుకుని దీక్ష చేపట్టవచ్చని పేర్కొన్నారు ఈ తరహా అనుమతులకు సంబంధించి వచ్చే విజ్ఞప్తుల్ని సీపీ కార్యాలయానికి పంపవద్దని డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలకు సీపీ మహేష్‌ భగవత్‌ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.