హైదరాబాద్ లో అదృశ్యమైన బాలిక.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో శవమై కనిపించింది. బహదూర్‌పుర పోలీసుల కథనం ప్రకారం.. కిషన్‌బాగ్‌లోని అసద్‌బాబానగర్‌కు చెందిన ఎండీ సలీమ్‌ కుమార్తె సబాబేగం(14) 8వ తరగతి చదువుతోంది. ఈనెల 24న మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న సబాబేగం.. తర్వాత కనిపించకుండా పోయింది. 

జావేద్‌ఖాన్‌ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు బహదూర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు జావేద్‌ఖాన్‌, సబాబేగం కోసం గాలింపు ప్రారంభించారు. 

ఈ క్రమంలో.. ఔరంగబాద్‌లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఒక బాలిక మరణించిందని, ఆమెతో ఉన్న యువకుడు గాయాలపాలయ్యాడంటూ బహదూర్‌పుర పోలీసులకు సమాచారం అందింది. సబాబేగం తల్లిదండ్రులు ఇచ్చిన వివరాలతో మృతురాలి ఆనవాళ్లు సరిపోలడంతో.. ఎస్సై నర్సింహారావు నేతృత్వంలోని ఓ బృందం ఔరంగబాద్‌కు బయలుదేరింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.