Asianet News TeluguAsianet News Telugu

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రోజు హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయం పెంపు..!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు మెట్రో సర్వీసుల సమయం పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది

Hyderabad Metro Train Services Extended on 25th september for ind vs aus t20i at uppal stadium
Author
First Published Sep 22, 2022, 5:42 PM IST

క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ-20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు మెట్రో సర్వీసుల సమయం పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. అర్దరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నారు. మ్యాచ్ పూర్తైన తర్వాత అభిమానులు సులవుగా వారి నివాసాలకు వెళ్లేలా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు నడపనున్నట్టుగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే.. మెట్రో పిల్లర్లపై పోస్టర్లు వేయడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. మెట్రో రైల్ పిల్లర్లపై పోస్టర్లు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గల్లీ లీడర్లు ఎక్కువగా ఈ పోస్టర్లు వేస్తున్నారని చెప్పారు. సెంట్రల్ మెట్రో రూల్స్ అమలు చేస్తామని చెప్పారు. పోస్టర్లు అంటించినవారు రూ. వెయ్యి జరిమానాతో పాటు ఆరేల్లు జైలు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. 

ఇక, దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. దీంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు.. గత కొద్ది రోజులుగా టికెట్ల కోసం క్రికెట్  అభిమానులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన పేటీమ్ ద్వారా ఆన్‌లైన్‌లో మ్యాచ్ టికెట్లు విక్రయించారు.  అభిమానులు తమ టిక్కెట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలిగినప్పటికీ, మ్యాచ్ రోజున స్టేడియంలోకి ప్రవేశించడానికి వారు తమ భౌతిక టిక్కెట్‌లను సేకరించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 22 నుండి 25 వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ నుండి భౌతిక టిక్కెట్లను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. 

మరోవైపు ఆఫ్ లైన్ టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు జింఖానా గ్రౌండ్‌ చుట్టు గత రెండు, మూడు రోజులుగా చక్కర్లు కొట్టారు. అయితే గురువారం ఆఫ్ లైన్ టిక్కెట్లను విక్రయించనున్నారనే అధికారులు తెలుపడంతో.. పెద్ద సంఖ్యలో అభిమానులు తెల్లవారుజామునుంచే జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో.. పోలీసులు వారిని నియంత్రించలేపోయారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్పృహ తప్పి పడిపోయారు. అలాగే పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో హెచ్‌సీఏ టికెట్ కౌంటర్లను మూసివేసింది. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కొందరు ఆగ్రహించిన అభిమానులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు హెచ్‌సీఏ అవినీతి, దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై హెచ్‌సీఏ అధికారులు ఇంకా స్పందించలేదు.

ఇక, జింఖానా గ్రౌండ్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఓ అభిమాని మృతిపై సోషల్ మీడియా, టీవీ చానెళ్లలో ప్రచారం జరిగింది. అయితే పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించడంతో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (స్పెషల్ బ్రాంచ్) విశ్వ ప్రసాద్ ఈ ఘటనలో ఎలాంటి మరణం లేదని స్పష్టం చేశారు. ఐదుగురు పౌరులు, ఇద్దరు పోలీసులు గాయపడ్డారని.. వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. వారు ప్రస్తుతం ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత టికెట్ కౌంటర్ల సంఖ్యను పెంచుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios