హైదరాబాద్ మెట్రో రైలు వేగం పెరగనుంది. ఈ మేరకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) అనుమతులు మంజూరు చేసింది. దీని వల్ల ప్రయాణీకులకు సమయం కలిసి రానుంది. 

ట్రాఫిక్ కష్టాలకు దూరంగా సుఖవంతంగా, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది హైదరాబాద్ మెట్రో రైలు. దీని వల్ల ఎంతో సమయం ప్రయాణీకులకు కలిసి వస్తుంది. అయితే మెట్రో రైలు వేగంగా వెళ్లకపోవడంతో జనం నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు మరింత వేగంగా వెళ్లేందుకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) (commissioner of metro rail safety) అనుమతించింది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి (kvb reddy) ఆదివారం తెలియజేశారు. ఇప్పుడున్న వేగం కంటే మరో పది కిలోమీటర్లు వేగంగా వెళ్లేందుకు అనుమతి లభించినట్లు ఆయన చెప్పారు. 

రైళ్ల వేగాన్ని గత నెల 28, 29 తేదీల్లో కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ ఉన్నతాధికారులు పరిశీలించారు. అన్ని అంశాలు సరిచూసుకుని వేగం పెంపుకు సీఎంఆర్ఎస్ అనుమతి మంజూరు చేసింది. వేగం పెరగడం వల్ల నగరంలో దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గనుంది. ప్రధానంగా నాగోలు - రాయదుర్గం మధ్య 6 నిమిషాలు, మియాపూర్‌ - ఎల్బీనగర్‌ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మధ్య 1.5 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. గతంలో 80 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణించేది. తాజాగా సీఎంఆర్ఎస్ ఆమోదందో ఈ వేగం 90 కిలోమీటర్లకు పెరగనుంది. కానీ, ప్రతి స్టేషన్‌ వద్ద ఆగాల్సి వుండటం వల్ల ఈ వేగం సాధారణంగా కొంత వరకు తగ్గే అవకాశం వుంది. 

మరోవైపు.. హైదరాబాద్ మెట్రో (hyderabad metro) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హాలిడేస్‌ను ఎంజాయ్ చేసేందుకు వీలుగా ప్ర‌యాణికుల‌కు సూప‌ర్ సేవ‌ర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. హైద‌రాబాద్ మెట్రో రైల్లో సూప‌ర్ సేవ‌ర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్డుతో సెల‌వుల్లో రూ. 59తో రోజంతా మెట్రోలో తిర‌గొచ్చ‌ని కేవీబీ రెడ్డి చెప్పారు. న‌గ‌రంలో ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా రోజంతా తిర‌గొచ్చ‌ని తెలిపారు. మెట్రో వ‌ర్గాలు ప్ర‌క‌టించిన 100 రోజుల సెలవుల్లో ఈ సూప‌ర్ సేవ‌ర్ కార్డు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.

కోవిడ్ కారణంగా గత రెండు ఏళ్లుగా ప్రజలు బయట ఎక్కువగా తిరగలేకపోయారని కేవీబీ రెడ్డి చెప్పారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకుంటున్నాయని వెల్లడించారు. ఇక, మెట్రో సువర్ణ ఆఫర్‌‌లో భాగంగా లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసిన ఐదుగురు విజేతలుగా ప్రకటించారు. వారిని బహుమతులు అందజేశారు.

మెట్రో ప్రకటించిన సెలవులు ఇవే..
ప్రతి ఆదివారం, ప్రతి రెండో, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోగ్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగి, శివరాత్రి, సంక్రాంతి