తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ విధులకు హాజరు కావడం లేదు. దీంతో... కొందరు ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నిర్వహిస్తున్నారు. అవి ఎక్కువగా ఉండకపోవడంతో... జనాలు ఎక్కువగా మెట్రోని ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో... మెట్రో రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల 3.75లక్షల మందితో రికార్డు నెలకొల్పగా... సోమవారం రద్దీ 3.80లక్షలకు చేరుకుంది.

ఆర్టీసీ సమ్మెతో అందరి చూపు మెట్రో వైపు పడింది. త్వరగా గమ్య స్థానాలను  చేరుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా దీనిపైనే దృష్టి పెడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణీకులు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండటంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి 11గంటల వరకు పలు రూట్లలో మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి.

ఎల్బీనగర్-మియాపూర్ రూట్లోని ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, అమీర్ పేట్, మియాపూర్ స్టేషన్లలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

ఇక నాగోల్-హైటెక్ సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, మెట్టూగూడా, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ స్టేషన్లు రికార్డు సంఖ్యలో ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నట్లు తెలిపారు. ఆయా స్టేషన్లలో సాధారణ రోజులతో పోలిస్తే ఎంట్రీ, ఎగ్జిట్ అయ్యే ప్రయాణికుల సంఖ్య సోమవారం రెట్టింపు గా ఉందని ఆయన చెప్పారు. 

ప్రయాణికులు ఎక్కువగా వస్తుండటంతో.. ఆయా స్టేషన్లలో ప్రత్యేక టిక్కెట్ కౌంటర్లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రద్దీ రూట్లలో ప్రతి మూడు నుంచి ఐదు నిమిషాలకు ఒక రైలును నడుపుతున్నామన్నారు. సమ్మె రోజుల్లో రోజుకి 2.780లక్షల మందిని కూడా మించరు.. ఒకవేళ సెలవు రోజు అయితే 3లక్షలకు చేరుకుంటారని వారు చెబుతున్నారు.

కాగా... ఇప్పటికే ఆర్టీసీ సమ్మె పది రోజులకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గడం లేదు... మరో వైపు ప్రభుత్వం కూడా కిందకు దిగి రావడం లేదు. సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి కూడా తొలగిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. దీంతో... ఇద్దరు కార్మికులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో వైపు సమ్మె విరమింపచేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.