Asianet News TeluguAsianet News Telugu

ఎంజీబీఎస్, జేబీఎస్‌ల మధ్య మెట్రో రైలు: నేడు ప్రారంభించనున్న కేసీఆర్

ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ల మధ్య మెట్రో రైలు ను తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాాడు ప్రారంభించనున్నారు. 

Hyderabad: Metro Green Line starts today
Author
Hyderabad, First Published Feb 7, 2020, 8:10 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్:ఎంజీబీఎస్, జూబ్లీహిల్స్ బస్‌స్టేషన్ల మధ్య  మెట్రో రైలు కారిడార్‌ను శుక్రవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ రెండు బస్ స్టేషన్ల మధ్య 11 కి.మీ. దూరం ఉంటుంది. 11 కి.మీ దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో మెట్రో రైలులో చేరుకోవచ్చని అధికారులు ప్రకటించారు.

ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ల మధ్య 9 స్టేషన్లు ఉంటాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్ మీదుగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కు మెట్రో రైలు చేరుకొంటుంది.

దేశంలోనే అతిపెద్ద ఇంటర్‌ఛేంజ్ స్టేషన్‌గా ఎంజీబీఎస్ ను సిద్దం చేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్ జంటనగరాలను కలుపుతూ ఈ రైలు మార్గం ప్రజలకు సేవలను అందించనుంది.

ఈ రైలు మార్గం కోసం 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో పూర్తిస్థాయి స్టీల్, నాణ్యమైన సిమెంట్ కాంక్రీట్‌తో స్టేషన్‌ను నిర్మించారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మార్గంలో ప్రయాణించే కారిడార్-1కు సంబంధించిన రైళ్ల రాకపోకలు ఇంటర్‌ఛేంజ్ మెట్రోస్టేషన్ కింది అంతస్తుల ద్వారా ప్రయాణిస్తాయి.

కారిడార్2 జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా మార్గంలో సాగించే రైలు పైఅంతస్తుల ద్వారా రాకపోకలు సాగిస్తాయి. ఐతే ఒక మార్గం నుంచి మరో మార్గం మారడానికి సులభమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా నిర్మించారు. రిటైల్ అవుట్‌లెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ , కన్వీయెన్స్ అవుట్‌లెట్స్‌ను కాంకర్స్ లెవెల్‌లో నిర్మించారు.

140 మీటర్ల పొడవుతో 60 మీటర్ల వెడల్పుతో నిర్మించే ఈ ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ మూసీనది భాగంలో నిర్మించబడి ప్రత్యేకతగా నిలుస్తున్నది.
రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా దీనిని నిర్మించారు. 

ఈ స్టేషన్ నుంచి ఒక వైపున ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లో నేరుగా ప్రయాణికులు దిగేందుకు వీలుండగా, మరోమార్గం మూసీ నదిదాటుతూ చాదర్‌ఘట్ వైపు స్టేషన్ నుంచి దిగేలా ఏర్పాట్లు చేశారు. వీటి కోసం రెండు స్కైవేలను నిర్మాణంలో ఉన్నాయి. 

మెట్రోస్టేషన్ నుంచి చాదర్‌ఘట్ వైపు నిర్మించే స్కైవాక్ అతిపెద్దదిగా ఉంటుంది. 600 అడుగుల పొడవుతో 20 అడుగుల వెడల్పుతో దీనిని నిర్మిస్తున్నారు. 
ఈ మార్గంలో వారసత్వ నిర్మాణాలతో సమానంగా 5 కిలోమీటర్ల మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించగా ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ కూడా దీనిలోభాగం కానుంది. 

అందులోభాగంగా అసెంబ్లీ, ఎంజీబీఎస్, నాంపల్లి, ఎంజే మార్కెట్, జాంబాగ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, రంగ్‌మహల్ ఏరియాలు హెరిటేజ్‌లుక్‌ను సంతరించుకోనున్నాయి. శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios