హైదరాబాద్: ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే నెపంతో ఓ భర్త తన భార్య, ఇద్దరు చిన్నారులను రూ. 3 లక్షలకు విక్రయించిన ఘటన హైద్రాబాద్‌ చాంద్రాయణగుట్టలో చోటు చేసుకొంది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడ పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తోంది.   బాధితురాలికి తాను అండగా నిలుస్తానని పీయూసీఎల్ నేత జయ వింద్యాల చెప్పారు.

ఫజల్ రహమాన్‌కు, ఫర్వీన్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది.  ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పెద్ద పాప వయస్సు రెండేళ్ల వయస్సు ఉంటుంది. చిన్నారి మరో చిన్నారి వయస్సు నాలుగు మాసాలు ఉంటుంది.

అయితే ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో పథకం ప్రకారంగా రహమాన్ తన భార్యను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. షాద్‌నగర్‌లో బంధువుల వివాహం ఉందని చెప్పి భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యులు వెళ్లిపోయారు. అప్పటి నుండి భర్తకు ఎన్నిసార్లు పోన్ చేసినా కూడ స్పందించలేదు.

ఆదివారం నాడు బేగంపేటకు చెందిన ఓ వ్యక్తి తన ముగ్గురు అనుచరులతో కలిసి ఫర్వీన్ వద్దకు వచ్చి ఆమెను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే   ఫర్వీన్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు అక్కడి వచ్చి బేగంపేట నుండి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తిని పంపించివేశారు. తనకు ఫర్వీన్‌తో పాటు ఆమె ఇద్దరి పిల్లల్ని రహమాన్ విక్రయించాడని బేగంపేటకు చెందిన వ్యక్తి పోలీసులకు చెప్పాడు.

ఈ విషయమై తనకు న్యాయం చేయాలని  బాధితురాలు పీయూసీఎల్ నేత జయ వింధ్యాలను కోరారు. బాధితురాలికి అందగా ఉంటామని ఆమె చెప్పారు.ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.