అల్వాల్ శ్రీకాంత్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు కనకరాజుతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బిల్డర్ గా ఉన్న కనకరాజుతో పాటు అతని వద్ద పని చేస్తున్న ఇద్దరు మేస్ట్రీలు, హస్మాత్ పేట్ స్మశానవాటిక నిర్వాహకుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టారు. 

కనకరాజు శ్రీకాంత్ రెడ్డిని నలభై ఐదు రోజుల పాటు దమ్మాయిగూడెంలోని ఓ అపార్ట్మెంట్ లో బంధించి ఉంచాడని తేలింది.  శ్రీకాంత్ రెడ్డి పారిపోకుండా ఇద్దరు మేస్త్రీలు కాపలా పెట్టాడు. తరచుగా కనకరాజు కూడా వచ్చి శ్రీకాంత్ రెడ్డిని హింసిస్తుండేవాడు. ఈ క్రమంలో ఆ రోజు కూడా వచ్చిన కనకరాజుకు శ్రీకాంత్ రెడ్డికి మధ్య వాగ్వివాదం పెరిగింది. 

దీంతో కోపానికి వచ్చిన కనకరాజు శ్రీకాంత్ మెడకు తాడు బిగించి హత్య చేశాడు. అ తర్వాత కారులో శ్రీకాంత్ డెడ్ బాడీ ని హస్మాత్ పేట్ స్మశానవాటిక తీసుకువచ్చిన కనకరాజు, స్మశానవాటిక నిర్వాహకుడు రాజేష్ తో కలిసి డెడ్ బాడీ ని పూడ్చిపెట్టినట్టు గుర్తించారు. 

మద్యం మత్తులో ఇటీవల స్నేహితుల మధ్య కనకరాజు నోరు జారడంతో సమాచారం అందుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా కనకరాజు హత్య కేసు వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం శ్రీకాంత్ రెడ్డి హత్య పై పూర్తి వివరాలు పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. 

కనకరాజు అక్రమసంబంధం పెట్టుకున్న అమ్మాయితో శ్రీకాంత్ రెడ్డి పారిపోవడమే ఈ హత్యకు కారణమన్న విషయం తెలిసిందే.