రోజు రోజుకీ సైబర్ నేరగాళ్లు నగరంలో పెరిగిపోతున్నారు. అమాయలను టార్గెట్ చేసి.. వారి బ్యాంకు ఖాతాల్లో నుంచి రూ.లక్షలు కాజేస్తున్నారు. తాజాగా.. కేవైసీ అప్ డేట్ పేరిట ఐటీ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. అతని ఖాతాలో నుంచి డబ్బంతా కాజేశారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇటీవల గచ్చిబౌలికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ‘‘మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) వివరాలు అప్‌డేట్‌ కాలేదు. వెంటనే అప్‌డేట్‌ చేసుకోకపోతే ఖాతా బ్లాక్‌ చేయబడుతుంది’’ అంటూ ఆర్‌బీఐ నుంచి వచ్చినట్లుగా మెసేజ్‌ వచ్చింది. ఆ తర్వాత ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ‘మీ కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయండి లేదంటే టీమ్‌వీవర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి పాస్‌వర్డు చెబితే మేం అప్‌డేట్‌ చేస్తాం.’’ అంటూ నమ్మించారు. అతను చెప్పినట్టు చేయగానే బాధితుడి స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడిన సైబర్‌ నేరగాడు అతని ఖాతా వివరాలు, నెట్‌ బ్యాంకింగ్‌ ట్రాన్స్‌క్షన్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. ఆ తర్వాత విడతల వారీగా అతని ఖాతాలో ఉన్న రూ. 8లక్షలు దోచేశాడు.