కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా ఎంతోమందిని ఆదుకున్నాడు సోనూసూద్. ఫలితం ఆశించకుండా ఆయన చేసిన అసాధారణ సేవలకు గాను యూఎన్‌ఓ నుంచి ప్రతిష్టాత్మక స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డ్‌, యూకేకు చెందిన ఈస్టర్న్‌ ఐ పత్రిక ‘టాప్‌ 50 సౌత్‌ ఏషియన్‌ సెలబ్రిటీస్‌ ఇన్‌ ద వరల్డ్‌’ లిస్ట్‌లో ఫస్ట్‌ప్లేస్‌లో నిలవడంతో పాటు ఎంతోమంది హృదయాల్లో నిలిచిపోయాడు సోనూ సూద్. 

తమ కష్టాలు తీర్చేవాళ్లు అంటే అందరికి ముందు సోనూసూదే గుర్తుకు వస్తున్నాడు. అతనికో అప్లికేషన్‌ పెడితే తమ కష్టాలు తీరతాయని నమ్ముతున్నారు సామాన్యులు. అలాంటి సోనూసూద్ కే అవార్డ్ ఇచ్చాడో సామాన్యుడు. సిటీకి చెందిన ఓ సాధారణ కార్పెంటర్‌ సోనూకు అవార్డ్‌ ఇవ్వడం, దాన్ని ఆయన వినమ్రంగా స్వీకరించడం విశేషం.   

నగరానికి చెందిన ఇంద్రోజిర రమేష్‌ ఓ కార్మికుడు. సామాజిక సేవ అంటే ఇష్టం కానీ తను స్వయంగా చేసే పరిస్థితి లేదు అందుకే సామాజిక సేవకులంటే అమితమైన ఆరాధన ఆయనకు.. అలాంటి మానవతా వాదులను వెతుక్కుంటూ వెళ్లి తనే స్వయంగా తయారు చేసిన ప్రతిమని బహుకరించి పద్మ సేవా అవార్డుతో సత్కరిస్తాడు. 

రమేష్ తానిచ్చే పద్మ సేవా అవార్డును సోనూసూద్ కు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. తానే స్వయంగా తయారు చేసిన ఫోటో ఫ్రేమ్ తో వెళ్లి సోనూసూద్ ను అందించి చిరు సత్కారం చేశాడు. ఈ సత్కారాన్ని సోనూసూద్ వినమ్రంగా అంగీకరించాడు. 

ఇంద్రోజిర రమేష్‌ ఇప్పటి వరకు 95 మందికి పైగా వీటిని అందించాడు. అందులో ఉచితంగా గుండె ఆపరేషన్స్‌ చేయిస్తున్న లారెన్స్, కష్టాల్లో ఉన్నవారికి ‘నేను సైతం’ అంటూ అండగా నిలిచిన లక్ష్మీ మంచు, 220 సార్లు రక్తదానం చేసిన సంపత్‌ కుమార్, భిక్షాటనతో సంపాదించిన రూ.3 లక్షలను సమాజానికే ఖర్చు చేసిన కామరాజు లాంటి వారు ఎందరో ఉన్నారు.  

కరోనా కష్టకాలంలో పేదవారికి పెద్ద దిక్కుగా మారాడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌గా చేసినా నిజజీవితంలో మాత్రం ప్రజల మనసు గెలుచుకున్న హీరోగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోనూసూద్‌ను ఎలాగైనా తన అవార్డ్‌తో సత్కరించాలనుకున్నాడు రమేష్‌. నగరానికి వచ్చిన సోనూసూద్‌ను కలిసి ప్రతిమతో సత్కరించాడు.  

చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించా.. ఆ సమయంలో నాకు ఎవరూ సాయం చేయలేదు. ఎన్నో ఏళ్లుగా కార్పెంటర్‌గానే కొనసాగుతున్నాను. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వారంటే నాకు ఎంతో ఇష్టం. నా ఆర్థిక స్తోమతకు తగ్గట్లు నేనే సొంతంగా అవార్డు తయారు చేసి వారికి అందజేస్తున్నాను. అని చెప్పుకొచ్చాడు రమేష్.