ప్రేమ పేరిట ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి వల వేశాడు. తన మాయ మాటలతో ఆమెను తన ట్రాప్ లో పడేసుకున్నాడు. సరదాగా బయటకు వెళదామని వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

తీరా అతనికి అప్పటికే పెళ్లి అయిపోయి ఉందని తెలిసి షాకైన యువతి మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన 2014లో చోటుచేసుకోగా.. తాజాగా నిందితుడికి మూడేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Also Read కరోనా వైరస్: హైద్రాబాద్‌లో కేంద్ర వైద్య బృందం పర్యటన...

పూర్తి వివరాల్లోకి వెళితే... హఫీజ్ పేటకు చెందిన అనిల్(24) సెంట్రింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో అదే ప్రాంతంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ బాలిక(18) పై అనిల్ కన్నుపడింది. ప్రేమిస్తున్నానంటూ రోజూ ఆమె వెంటపడేవాడు. దీంతో అతని ప్రేమను సదరు బాలిక కూడా అంగీకరించింది.ఓ రోజూ బయటకు వెళదామంటూ బాలికను మెదక్ తీసుకువెళ్లాడు.

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే.. సదరు బాలిక కనిపించడం లేదని ఆమె పేరెంట్స్ సనత్ నగర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్లు మెదక్ లో ఉన్నట్లు గుర్తించారు. విచారణలో అనిల్ కి అప్పటికే పెళ్లి అయ్యిందని గుర్తించారు. దీంతో కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు.

తాజాగా... ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. అనిల్ నేరం చేశాడని రుజువుకావడంతో   ఎల్బీనగర్ లోని  మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి .. అతనికి మూడేళ్లపాటు జైలు శిక్ష విధించారు.