తెలంగాణ ప్రభుత్వ హయాంలొ రెండు సంవత్సరాల క్రితం గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాల కోసం రాతపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే కోర్టు కేసుల మూలంగా ఈ నియామకాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రాతపరీక్ష  బాగా రాసి ఈ ఉద్యోగాలపై ఆశలుపెట్టుకున్న నిరుద్యోగులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు తెరపడేలా తాజాగా హైకోర్టు తీర్పు వెలువరించింది. 

2016, నవంబర్ 11, 13 తేదీల్లో టీఎస్‌పిఎస్సి గ్రూప్-2 పరీక్షను నిర్వహించింది. అయితే ఈ రాతపరీక్షల్లో బబ్లింగ్ చేయని, వైట్‌నర్ ఉపయోగించిన వారి ఫలితాలు కూడా వెల్లడించడంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్దంగా టీఎస్‌పిఎస్సి కొందరికి అనుకూలంగా వ్యవహరించిందంటూ కోర్టుకు విన్నవించారు. దీంతో ఈ నియామక ప్రక్రియను ఆపేసిన టీఎస్‌‌పిఎస్సీతో పాటు అభ్యర్థులు కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

అభ్యర్థులకు ఊరట కల్పిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.  ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో డబుల్ బబ్లింగ్ చేసి, వైట్‌నర్ వాడిన వారిని తొలగించి.. మిగతా వారికి ఇంటర్వ్యూ నిర్వహించడానికి కోర్టు అనుమతించింది. దీంతో  వైట్‌నగర్‌, డబుల్‌ బబ్లింగ్‌ చేసిన 267మంది ఈ ఉద్యోగాలకు దూరం కానున్నారు. 

ఈ గ్రూప్‌-2 రాతపరీక్షలో 3,147మంది అభ్యర్థుల అర్హత సాధించారు. వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి కేవలం 1032 మందికి మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.