ఖరీదైన కారును చోరీ చేశాడు. ఎవరైనా చోరీ చేసిన వస్తువుని రహస్యంగా దాచిపెడతారు. కానీ ఈ దొంగ మాత్రం దర్జాగా ఆ కారుతో నగరంలో షికారు చేశాడు. అయితే... ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేశాడు. లోపల ఏమి కనిపించకుండా నల్లని అద్దాలు.. కారుకు ముందూవెనుక భాగంలో పోలీసు స్టిక్కర్లు అంటించి హాయిగా.. నగరంలో షికారు చేశాడు.

తన వాహనంపై పోలీసు స్టిక్కరు చేసి తనను ఎవరూ ఆపరూ అనుకున్నాడు. కానీ అతని కథ అడ్డం తిరిగింది.  వేగంగా వెళ్తున్న కారును జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో పోలీసులు మంగళవారం నిలువరించారు. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.  నంబరు ప్లేటు సరిగా లేకపోవడం, వాహనంపై పోలీసు స్టిక్కర్లు ఉండటంతో పోలీసులు తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. 

ఏపీ 16 బీఈ 0300 నంబరుకు బదులుగా ఏపీ 16 బీఈ 3 నంబరుతో ఈ వాహనాన్ని నడుపుతున్నారు. ఇక పోలీసు వాహనమని స్టిక్కర్లు అతికించి మోసం చేయడంతో పాటు అద్దాలకు నలుపు తెరలు ఉండటంతో జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు సీజ్‌ చేశారు. కారు నడుపుతున్న వ్యక్తిని సికింద్రాబాద్‌లోని శివాజీనగర్‌కు చెందిన సందీప్‌ (21)గా గుర్తించారు. అతడిపై చట్టపరమైన చర్యలకు జూబ్లీహిల్స్‌ పోలీసులకు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు