హైదరాబాద్ నగరంలో దొంగలు చెలరేగిపోతున్నారు. నిన్న , మొన్నటి వరకు ఇళ్లల్లో మాత్రమే దొంగలు పడేవారు. డబ్బు, బంగారం దోచుకువెళ్లేవారు. కాగా.. ఈ మధ్యకాలంలో వాహన దొంగలు కూడా పెరిగిపోయారు. ఎల్బీ నగర్ పరిధిలో వాహనాల దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఖరీదైన కార్లు, బైక్‌లను సులభంగా తస్కరిస్తున్నారు. ఖరీదైన కార్ల చోరీలు వరుసగా జరుగుతుండటంతో వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ ఇద్దరు వ్యక్తులు ఖరీదైన ఫార్చూనర్ కారును దారిన పోయేవారికి ఏమాత్రం అనుమానం రాకుండా తస్కరించారు.
 
కారు ఓనర్లలా బిల్డప్ ఇచ్చి దర్జాగా తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ముందుగా స్విఫ్ట్ కారులో వచ్చిన ఆగంతకులు.. ఓ ఇంటి ముందు పార్క్ చేసిన ఉన్న ఫార్చూనర్ కారు డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి తీశారు. ఆ వెంటనే బానెట్ తెరిచి వాహనానికి అమర్చిన థెఫ్ట్ సౌండ్ రాకుండా చేసి పక్కకు వెళ్లారు. కాసేపటి తరువాత అదును చూసి దానిని వేసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.