హైదరాబాద్: హైద్రాబాద్‌లో లిక్విడ్ గంజాయిని సరఫరా చేస్తున్న ఇద్దరిని ఆదివారం నాడు   ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుల్లితెర నటుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్‌లో శనివారం నాడు జరిగిన సెన్సేషన్ రైస్ ఈవెంట్‌కు హాజరయ్యే  యువతకు లిక్విడ్ గంజాయిని సరఫరా చేసేందుకు  ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 10 మి.లీ. లిక్విడ్ గంజాయికి  వెయ్యి నుండి రెండు వేల రూపాయాలకు విక్రయిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

తొలిసారిగా హైద్రాబాద్‌లో లిక్విడ్ గంజాయిని విక్రయిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. సెన్సేషన్ రైస్ పార్టీకి వెళ్లే యువతకు విక్రయించేందుకు ఈ లిక్విడ్ గంజాయిని తెచ్చామని నిందితులు చెప్పారని... అయితే  ఈ విషయమై ఇది వాస్తవమా... లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఈ ఏడాది ఆగష్టు నుండి  వీరిద్దరూ నిందితులు లిక్విడ్ గంజాయిని సరఫరా చేస్తున్నారని చెబుతున్నారని... ఈ విషయమై కూడ విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఈ ఇద్దరు నిందితులకు సంబంధించిన సమాచారాన్ని  బుల్లితెర నటుడు పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. బుల్లితెర నటుడు అంబర్‌పేటలో పోలీసులకు చిక్కడంతో ఈ ఇద్దరు నిందితుల  సమాచారం బయటకు వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.