హైదరాబాద్ లో కలకలం రేపిన డెంటిస్ట్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. పోలీసులు రావడం ఓ పది నిముషాలు ఆలస్యమైతే తనను చంపేసేవారని డాక్టర్ హుస్సేన్ అన్నాడు. తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కలిసి సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి వైద్యుడ్ని కాపాడారు. దగ్గరి బంధువే ఈ ఘోరానికి పాల్పడ్డాడని గుర్తించారు. మొత్తం పదమూడు మంది కలిసి కిడ్నాప్ చేశారని తేలింది. వీరిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు.

రాజేంద్రనగర్ లోని కిస్మత్ పూర్ కు చెందిన డెంటిస్ట్ బెహ్ జాత్ హుస్సేన్  బండ్లగూడ జాగీర్ లో క్లినిక్ నడుపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం క్లినిక్ లో ఉండగా ఒంటిగంటంప్పావు టైంలో కిడ్నాప్ అయ్యాడు. పదికోట్ల రూపాయలు బిట్ కాయిన్ రూపంలో ఇవ్వాలని లేకుంటే చంపేస్తామంటూ డాక్టర్ భార్యకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది.

దీంతో ఆమె సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. నిందితులు అర్థరాత్రి శంషాబాద్ ఓఆర్ ఆర్ ఇంటర్ ఛేంజ్ దగ్గర దిగి బెంగళూరు వైపు వెల్తున్నట్లు గుర్తించి అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబుకు సమాచారం అందించారు. వారు చేజ్ చేసి రాప్తాడులో నిందితులను పట్టుకున్నారు. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు పరారయ్యారు. సంజయ్ అనే 19 యేళ్ల వ్యక్తి చిక్కాడు. 

డాక్టర్ను కాళ్లు, చేతులు కట్టేసి, దుప్పట్లో చుట్టి రెండు సీట్ల మధ్య పడేశారు. వెంటనే వైద్యుడ్ని రక్షించి ఫస్ట్ ఎయిడ్ చేశారు. సంజయ్  ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో చంద్రకాంత్ భోంస్లే, అక్షయ్ బాలు, విక్కీ దత్త షిండే, మహ్మద్ రహీం, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇర్ఫాన్ లను అరెస్ట్ చేశారు.

కిడ్నాప్ ప్లాన్ చేసింది డాక్టర్ హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువైన ముస్తఫా. మద్యాహ్నం కిడ్నాప్ చేసి రాత్రి వరకు కూకట్ పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంచారు. తరువాత బెంగళూరుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు. అనుకోకుండా అనంతపురంలో పోలీసులు ఛేజ్ చేయడంతో ఇక పట్టుబడతామని, డాక్టర్ ని పదినిమిషాల్లో చంపేద్దామని డిస్కస్ చేసుకున్నారు. చంపేస్తామని బెదిరించారు. ఇంతలోనే పోలీసులు పట్టుకోవడంతో డాక్టర్ బతికి బయటపడ్డాడు.