డిజిటల్ రుణాలు, ఆన్‌లైన్ లోన్‌లకు సంబంధించిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేసి వారిని విచారించారు.

చైనాకు చెందిన లాంబో అనే వ్యక్తి లోన్ యాప్‌లను రూపొందించడంతో పాటు వాటి ద్వారా రుణాలు ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో లాంబోని ఒక రోజు పాటు కస్టడీలోకి తీసుకొని కొంత సమాచారాన్ని సేకరించారు.

నిందితుడి నుంచి ఫోన్, లాప్‌టాప్, ఐపాడ్‌లను స్వాధీనం చేసుకుని వాటిలోని డేటాను విశ్లేషిస్తున్నారు. లాంబో పంపిన సందేశాలు, అతనికి వచ్చిన సందేశాలు అన్నీ చైనా భాషలోనే ఉండటం పోలీసుల విచారణకు అవరోధంగా మారింది.

దీంతో చైనీస్ తెలిసిన వారిసాయం తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లోన్‌ యాప్‌ల బండారం బయటపడిన తర్వాత తన లాప్‌టాప్‌ నుంచి లాంబో కీలక సమాచారం తొలగించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

కంప్యూటర్ నిపుణుల సాయంతో లాప్‌టాప్‌లోని సమాచారాన్ని సైబర్‌ క్రైం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో బెంగళూరులో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న నలుగురిని సైబర్ క్రైం పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

రాజేంద్రనగర్, జగిత్యాలలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు ఈ యాప్‌ల నుంచి అప్పు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో బెంగళూరులో కాల్‌ సెంటర్ నిర్వాహిస్తున్న వారిపై రెండు కేసులను నమోదు చేశారు.

ఒక కేసులో నిందితులను ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. మరో కేసులో పీటీ వారంటుపై అదుపులోకి తీసుకొని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కస్టడీ కోరేందుకు అవకాశం ఉంది.