ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ పేరే వినపడుతోంది. ఇక ఐపీఎల్ షురూ అయ్యిందంటే.. క్రికెట్ బెట్టింగ్ లు కూడా సర్వసాధారణం. అయితే.. వాటిని ఎప్పటికప్పుడు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. తాజాగా... ఓ జంట క్రికెట్ బెట్టింగ్ చేస్తూ.. డబ్బులు వసూలు చేస్తుండగా.. పోలీసులకు చిక్కారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుంది.

వారిద్దరూ భార్యభర్తలు కాగా.. చాలా తెలివిగా ఈ బెట్టింగ్ వ్యవహారం నిర్వహించడం గమనార్హం. భర్త గోవాలో బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. భార్య ఇక్కడే హైదరాబాద్ లో ఉండి నగదు వసూలు చేస్తోంది. ఈ కేసులో సుమన్ లత, రాహుల్ సింగ్ లను పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ లో ఇప్పటి వరకు ఓ మహిళ అరెస్టు అవ్వడం తొలిసారి అని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన ధరమ్ సింగ్ తన భార్యతో కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడు. హైదరాబాద్ లో బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులకు అనుమానం వస్తుందని నెలన్నర క్రితమే గోవా వెళ్లిపోయాడు. ఐపీఎల్ ప్రారంభం కాగానే.. అక్కడి నుంచే బెట్టింగ్ లు వేయడం మొదలుపెట్టాడు. తన అల్లుడు రాహుల్ కు నెలకు రూ.20వేలు జీతం ఇస్తానని  చెప్పి... ఫోన్ ద్వారా బెట్టింగ్ కాసేవారి వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేవాడు.

కాగా..  రాహుల్, ధరమ్ సింగ్ భార్య సుమన్ లత ఇక్కడ హైదరాబాద్ లో ఉంటూ బెట్టింగ్ కాసేవారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాళ్లు. ఈ విషయం టాస్క్ ఫోర్స్ అధికారులకు తెలియడంతో.. నగరంలో ఉన్న రాహుల్, సుమన్ లతలను ముందుగా అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా గోవాలో ఉన్న ధరమ్ సింగ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ టీవీ, 15 సెల్ ఫోన్ లు, రూ.27వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.