గడ్డి తినడానికి వెళ్లిన ఓ ఆవు... గుంతలో పడి మూడు రోజులపాటు నరకం చూసింది. ప్రమాదవశాత్తు గుంతలోపడి... బయటకు రాలేక నానా అవస్థలు పడింది. దానిని చూసిన స్థానికులు జాలిపడి ఆహారం అందజేశారు తప్ప.. బయటకు తీసే సాహసం చేయలేకపోయారు. ఈ సంఘటన నాగోల్ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... మూడు రోజుల క్రితం ఓ ఆవు ఆహారం కోసం గడ్డిమేస్తూ.. నాగోల్ లోని ఓ 12 అడుగుల గుంతలో పడిపోయింది. అక్కడి నుంచి బయటకు రాలేక నానా అవస్థలు పడింది.ఆవు పరిమాణంలో పెద్దగా ఉండటంతో.. బటయకు తీయడానికి కూడా ఎవరూ సాహసం చేయలేకపోయారు. కాగా.. దానికి ఆహారంగా గడ్డి, చపాతీలు, మంచినీరు అందించినట్లు స్థానికులు తెలిపారు.

వేళకు ఆహారం అందించినప్పటికీ.. అది పడుతున్న బాధ చూడలేక పీఎఫ్ఏ( పీపుల్ ఫర్ యానిమల్స్) కి సమాచారం అందించారు. వారు ఆదివారం బృందంగా వచ్చి గుంతలో పడిన ఆవును బయటకు తీశారు. ఆ ఆవు మొదట తమను చూసి చాలా భయపడిందని పీఎఫ్ఏ సభ్యుడు దత్తాత్రేయ జోష్ తెలిపారు. ఆవును బయటకు తీసిన అనంతరం చికిత్స నిమిత్తం దానిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.