పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబ వివాదం న్యాయస్థానం మెట్లెక్కింది. ఆయన కోడలు ప్రజ్ఞారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలు  జారీ చేసింది. బాధితురాలికి భద్రత కల్పించాలని చెబుతూ విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. 

నేతి మిఠాయిల వ్యాపారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్ర‌ఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వీట్స్ (pulla reddy sweets) య‌జ‌మాని కుటుంబ వివాదం తాజాగా కోర్టుకి చేరింది. త‌న‌పై గృహ హింస‌కు (domestic violence) పాల్ప‌డుతున్నారంటూ పుల్లారెడ్డి స్వీట్స్ య‌జ‌మాని రాఘ‌వ‌రెడ్డి కుటుంబంపై (raghava reddy) ఆయ‌న కోడ‌లు ప్ర‌జ్ఞారెడ్డి బుధవారం హైద‌రాబాద్ మొబైల్ కోర్టును ఆశ్ర‌యించారు. ఆమె పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు బాధితురాలికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని పంజాగుట్ట పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 9కి వాయిదా వేసింది.

కాగా.. త‌న‌ను హింసిస్తున్నారంటూ ప్ర‌జ్ఞారెడ్డి ఇదివ‌ర‌కే రాఘ‌వ‌రెడ్డి కుటుంబంపై పంజాగుట్ట పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అయినప్పటికీ కూడా త‌న‌ను ఇంటిలోనే నిర్బంధించారంటూ ప్ర‌జ్ఞారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇంటిలో త‌న‌ను ఎలాంటి హింస‌కు గురి చేస్తున్నార‌న్న వైనాన్ని తెలిపే ఫొటోల‌ను కూడా ఆమె న్యాయస్థానానికి సమర్పించారు. దీంతో రాఘ‌వరెడ్డితో పాటు ఆయ‌న భార్య, కుమారుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

ALso Read:పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై గృహ హింస కేసు.. భార్య బయటకు రాకుండా గోడ కట్టేసి..

గత కొంతకాలంగా ఏక్‌నాథ్ రెడ్డి- ప్రజ్ఞా రెడ్డి దంపతుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏక్‌నాథ్ అడ్డుకున్నారు. వారుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్​నాథ్​ రెడ్డి తలచాడు. రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించాడని సమాచారం. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

దీంతో ఏక్‌నాథ్ భార్య డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. దీంతో స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను రక్షించారు. ఏక్ నాథ్ తండ్రి రాఘవరెడ్డి.. పుల్లా రెడ్డి గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రజ్ఞారెడ్డి తండ్రి మైనింగ్ వ్యాపారం చేస్తుంటారు. 2014లో ఏక్‌నాథ్ వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది.