హైదరాబాద్ వ్యాపారి మధుసూదన్ రెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గంజాయి వ్యాపారంలో మునిగిన మధుసూదన్ రెడ్డిని అదే బలి తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

హైదరాబాద్: వ్యాపారి మధుసూదన్ రెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గంజాయి వ్యాపారమే మధుసూదన్ రెడ్డి హత్యకు కారణమని తేల్చారు. హైదరాబాదులోని చార్మినార్ ప్రాంతంలో మధుసూదన్ రెడ్డి టీ కొట్టు నడిపేవాడు. అయితే, సంజయ్ అనే వ్యక్తి పరిచయంతో గంజాయి అక్రమ వ్యాపారంలోకి దిగాడు. 

సంజయ్, జగన్నాథం అనే వ్యక్తులతో కలిసి మధుసూదన్ రెడ్డి గంజాయి వ్యాపారం చేసేవాడు. ఆంధ్ర నుంచి సంజయ్ గంజాయి రవాణా చేసి మధుసూదన్ రెడ్డికి ఇచ్చేవాడు. ఈ క్రమంలో సంజయ్ అల్లుడు కారులో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 

ఆ సమయంలో మధుసూదన్ రెడ్డి నుంచి సంజయ్ 40 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అవి తిరిగి ఇవ్వాలని మధుసూదన్ రెడ్డి సంజయ్ మీద ఒత్తిడి పెడుతూ వచ్చాడు. ఈ క్రమంలో డబ్బులు తీసుకోవడానికి బీదర్ రావాల్సిందిగా మధుసూదన్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది.

దాంతో బీదర్ ప్రయాణమైన మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేసి హైదరాబాదు పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత శవాన్ని సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. 

హత్య చేసిన తర్వాత సంజయ్ మదుసూదన్ రెడ్డి భార్యకు ఫోన్ చేశాడు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. సంజయ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దాంతో మధుసూదన్ రెడ్డి కిడ్నాప్, హత్య ఉదంతం బయటపడింది.