ఓ వ్యాపారి పీకలదాకా మద్యం సేవించి... ఓ టెక్కీ ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ సమీపంలో చోటుచేసుకుంది.  

పూర్తి వివరాల్లోకి వెళితే... కొండాపూర్ లోని ఆనంద్ నగర్ కాలనీకి చెందిన అభిషేక్ ఆనంద్(28).. మాదాపూర్ లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అభిషేక్ స్వస్థలం బిహార్ లోని బగల్పూర్ కాగా... ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కి వచ్చాడు. అతను హైదరాబాద్ వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతోంది. అతను తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి కొండాపూర్ లో నివాసం ఉంటున్నాడు.

కాగా... ఆదివారం రాత్రి అభిషేక్ అతని స్నేహితురాలు లీసాధర్ చౌదరి తో కలిసి మాదాపూర్ లో డిన్నర్ కి వెళ్లాడు. డిన్నర్ చేసిన అనంతరం తన బైక్ పై ఇంటికి తిరిగిపయనమయ్యాడు. కాగా... దాదాపు రాత్రి 11గంటల 30 నిమిషాల సమయంలో.. ఓ బీఎండబ్ల్యూ కారు వచ్చి అభిషేక్ వాహనాన్ని ఢీ కొట్టింది. కాగా.. ఈ ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... లీసా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

కొండవీటి అశ్విన్(35) అనే వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి.. తప్పుడు మార్గంలో కారు నడుపుతూ వచ్చి.. బైక్ ని ఢీ కొట్టాడు.  నిందితుడు కొండవీటి అశ్విన్ ఓ వ్యాపారవేత్తగా గుర్తించారు. ప్రమాదం సమయంలో నిందితుడు 185ఎంజీ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని... కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.