పాలెం బస్సు ప్రమాదఘటనలో బస్సు డ్రైవర్ ఐదేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. ఐదేళ్ల క్రితం అంటే.. 2013 అక్టోబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జబ్బర్ ట్రావెల్స్ కి చెందిన బస్సు ప్రమాదానికి గురైన సంఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 51మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 44మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ ఫిరోజ్ పాషా.. అప్పుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన నాటి నుంచి డ్రైవర్ పరారీలోనే ఉన్నాడు. కాగా.. నిందితుడిని ఐదేళ్ల తర్వాత మంగళూరులో సీఐడీ అధికారులు ట్రేస్ చేయగలిగారు. వివిధ కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న 15మంది నేరస్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. వారికి ఫిరోజ్ మంగళూరులో దొరికాడు.

ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అతనిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిరోజ్ ని.. మహబూబ్ నగర్ తరలించారు. కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు చెప్పారు.