ఓ చీటింగ్‌ కేసులో రాజీ కుదర్చడానికి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా మీర్‌చౌక్‌ ఎస్‌ఐ సారంగపాణి, కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సిటీ రేంజ్‌-2 డీఎస్పీ అచ్చేశ్వర్‌రావు వివరాలు తెలిపారు. అంబర్‌పేట్‌కు చెందిన అనిల్‌కుమార్‌ మీర్‌చౌక్‌కు చెందిన వ్యక్తికి రూ. 37 లక్షలు ఇవ్వగా అతను తిరిగి చెల్లించలేదు. 

బాధితుడు అనిల్‌ నిరుడు మీర్‌చౌక్‌ ఠాణాలో కోర్టు రెఫర్‌ కేసు పెట్టారు. తర్వాత నార్సింగ్‌కు చెందిన ఓ రౌడీషీటర్‌ డబ్బు ఇప్పిస్తానని చెప్పి అనిల్‌ వద్ద 10 లక్షలు తీసుకున్నాడు. పోలీసుల వ్యవహారం అంతా చూసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత అనిల్‌కు రూ. 25 లక్షలు అందాయి. ఇంకా 12 లక్షలు రావాల్సి ఉండగా అనిల్‌... ఎస్‌ఐ సారంగపాణి వద్దకెళ్లి మిగతా డబ్బు కూడా ఇప్పించాలని కోరారు. 

రూ. 5 లక్షలు ఇప్పిస్తాను, అందులో తనకు రూ.2 లక్షలివ్వాలంటూ ఎస్‌ఐ డిమాండ్‌ చేశాడు. ఈ విషయం ఏసీబీ అధికారులకు చెప్పగా వారు అనిల్‌కు అడ్వాన్స్‌గా 50 వేలు ఇచ్చి అతడిని అనుసరించారు. సారంగపాణి సలహా మేరకు కిరణ్‌కుమార్‌... అనిల్‌ను దుర్రె షవార్‌ ఆస్పత్రి వద్దకు పిలిపించి రూ. 50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఎస్ఐ సారంగపాణి ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గతంలో డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి ప్రశంసాపత్రం కూడా అందుకోవడం గమనార్హం