Mumbai: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గత ఎన్నికల ఫలితాలే వస్తాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఔరంగాబాద్ నుంచి పోటీ చేస్తుందని కూడా చెప్పారు.
AIMIM chief Asaduddin Owaisi: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కొందరు ముస్లిం సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని బీజేపీని టార్గెట్ చేశారు. ముస్లింలపై దాడులు జరుగుతున్న బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గతం మాదిరిగానే ఓడిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీపై విమర్శల దాడిని కొనసాగించిన ఒవైసీ.. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే, కాషాయ పార్టీని ఓడించవచ్చని అన్నారు.
తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ దారుణ ఫలితాలు రాబట్టిందని పేర్కొన్న ఆయన.. ఈ ఏడాది కూడా డిసెంబర్ 2023లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ ఓడిపోవడం ఖాయమన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ నుంచి పోటీ చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. "వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగాబాద్, ఇతర స్థానాల నుంచి పోటీ చేస్తాం. మరికొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశాలను పరిశీలిస్తాం" అని ఒవైసీ చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ.. "కొందరు ముస్లిం సమాజంపై విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు, కానీ వారిపై ఎటువంటి చర్యలు లేవు. రాజస్థాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత్ జోడో, అల్వార్ లో రాయల్ వెడ్డింగ్ కు హాజరుకావచ్చు కానీ జునైద్, నాసిర్ హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లడం లేదని" విమర్శించారు. జునైద్, నాసిర్ ముస్లింలు కాకపోతే సీఎం అశోక్ గెహ్లాట్ అక్కడికి వెళ్లి ఉండేవారంటూ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ భివానీ హత్యలు జరిగినప్పుడు కాంగ్రెస్ అల్వార్ లో జరిగిన ఒక వివాహావేడకకు హాజరయ్యే పనిలో బిజీగా ఉందని విమర్శించారు.
కాగా, ఇద్దరు వ్యక్తులు జునైద్, అతని స్నేహితుడు నాసిర్ తప్పిపోయారనీ, బజరంగ్ దళ్ సభ్యులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ రాజస్థాన్‌లోని ఒక కుటుంబం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత హర్యానాలోని భివానీలో కాలిపోయిన వాహనంలో కాలిపోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసుకునీ, వారు హత్యకు గురయ్యారని చెప్పారు. వీరిద్దరు గోవుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణల క్రమంలో అంతకుముందు వీహెచ్ పీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.
అలాగే, ఔరంగాబాద్, ఉస్మానాబాద్ అనే రెండు మహారాష్ట్ర నగరాల పేర్లను వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధారాశివ్ గా మార్చడాన్ని పార్టీ వ్యతిరేకించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర హోంశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. ఈ నగరాల వాసులను విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. మన నగరాల భవితవ్యాన్ని ముంబయి లేదా ఢిల్లీలో కూర్చునే వ్యక్తులు నిర్ణయించలేరంటూ ఎంఐఎం మహారాష్ట్ర అధ్యక్షుడు, ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. పేరు మార్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ప్రస్తుతం బాంబే హైకోర్టు విచారణ జరుపుతోంది.
