హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును భరించేందుకు ఇద్దరు నేతలు సై అంటున్నారు.మరోవైపు కాంగ్రెస్ అనుసరించే వ్యూహం ఆధారంగా బీజేపీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై కమలదళం కసరత్తు చేస్తోంది. 

మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ నేతలు విపరీతంగా డబ్బులను ఖర్చు పెట్టే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అయితే టీఆర్ఎస్‌కు ధీటుగా డబ్బులను ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉండాలని కమలదళం భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి కోసం పార్టీ నాయకుల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇద్దరు ఎంపీలు, ఓ మాజీ ఎంపీతో పాటు ఓ మహిళా నేత  కూడ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.ఈ మేరకు వీరంతా బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. ఈ నెలాఖరుతో లక్ష్మణ్  గడువు ముగియనుంది.

ఇద్దరు యువ ఎంపీలు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆసక్తిగా ఉన్నారు.ఒక ఎంపీ కేంద్రంలో పదవిపై ఆసక్తిగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనకు ఇవ్వకపోతే కేంద్రంలో పదవిని ఇవ్వాలని జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారు. 

తన సహచరుడికి బీజేపీ చీఫ్ బాధ్యతలను అప్పగిస్తే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఖర్చును తాను భరిస్తానని ఆయన పార్టీ నాయకత్వానికి చెప్పినట్టుగా సమాచారం. అదే సమయంలో తనకు కేంద్రంలో ఒక పదవిని కూడ ఇవ్వాలని కోరినట్టుగా చెబుతున్నారు.

మాజీ మంత్రి ఓ మహిళా నేత కూడ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఆమె కూడ తరచూ ఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీ జాతీయ నాయకులను కలుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును తాను భరిస్తానని ఆమె పార్టీ జాతీయ నాయకత్వానికి హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇస్తే తాను మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును భరిస్తానని షరతు విధించినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవిలో తనను రెండోసారి కొనసాగించాలని డాక్టర్ లక్ష్మణ్ కూడ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలిపించడంలో తాను చేసిన కృషిని ఆయన ప్రస్తావిస్తున్నారు.

తెలంగాణలో కూడ పీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపీక చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వారసుడు ఎవరనే విషయమై ఇంకా ఓ స్పష్టత రాలేదు.

ఈ నెల 31వ తేదీతో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ పదవి కాలం ముగియనుంది.అయితే టీపీసీసీ చీఫ్  గా ఎవరిని నియమిస్తారనే విషయాన్ని చూసిన తర్వాతే బీజేపీ కొత్త నేతను ఎంపిక చేసే విషయాన్ని ఆలోచిస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు.

2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి కాంగ్రెస్ పార్టీ పీసీసీకి కొత్త నేతను ఇంకా ఎంపిక చేయలేదు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిల మధ్య టీపీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించినా, లేదా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించినా బీజేపీ మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక శ్రీధర్ బాబుకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే అగ్రవర్ణ సామాజికవర్గానికి చెందిన వారు లేదా మహిళా నేతకు బీజేపీ అధ్యక్షపదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.