ఇటీవల హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ ది కాకుండా పోయింది. ఇప్పుడు హైటెక్ సిటీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచే సైబర్ టవర్స్ కూడా మనది కాకుండా పోతోంది.
అసలు ఈ హైదరాబాద్ కు ఏమైంది. ఒక వైపు హైదరాబాదీ బిర్యానీ హైదరాబాద్ ది కాకుండా పోయింది. ఈ చేదువార్తను జీర్ణించుకునేలోపే మరో పిడుగులాంటి వార్త హైదరాబాదీలపై పడింది. హైటెక్ సిటీ అంటే వెంటనే గుర్తుకొచ్చే సైబర్ టవర్స్ బిల్డింగ్ కూడా ఇప్పుడు మనది కాకుండా పోతోంది.
అవును మీరు చదవుతుంది నిజమే. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాలనలో మోస్ట్ డైనమిక్ సిటీగా బెంగళూరును నిలపడంలో భాగంగా మన హైదరాబాద్ సైబర్ టవర్స్ ను వాళ్లు జప్తు చేశారు. కావాలంటే కర్నాటక ప్రభుత్వం విడుదల చేసిన ఈ ప్రకటన చూడండి.

ఓ యాడ్ ఏజెన్సీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమానికి తయారు చేసిన ప్రకటన ఇది. హైదరాబాద్ లో ఉన్న సైబర్ టవర్స్ ను బెంగళూరులో ఉన్నట్లు కలర్ ఫుల్ యాడ్ క్రియేట్ చేసింది. అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ తప్పును గమనించకుండా అక్కడి పత్రికలకు ఇచ్చేసింది. పత్రికలవాళ్లు కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఇలా అచ్చొత్తారు.
నెట్ లో ఈ యాడ్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. సైబర్ టవర్స్ సృష్టికర్తగా చెప్పుకొనే ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి ఈ యాడ్ వచ్చిందో లేదో... వస్తే ఇంకా ఎందుకు స్పందించడం లేదో...?
